ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) టెక్నాలజీ మంచి కన్నా చెడుకే ఎక్కువగా వాడుతున్నారనడానికి మరో ఉదాహరణ బయటపడింది. గతంలో నేషనల్ క్రష్ రష్మిక మందన్న తరహాలోనే ఇప్పుడు కన్నడ నటి, ‘సప్త సాగరదాచే ఎల్లో’, ‘కాంతార: చాప్టర్ 1’ ఫేమ్ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) కూడా డీప్‌ఫేక్ (Deepfake) బారిన పడ్డారు. ఆమె ముఖాన్ని అసభ్యకరమైన వీడియోలకు అతికించి కొందరు కేటుగాళ్లు సోషల్ మీడియాలో సర్క్యులేట్ చేశారు.
దీనిపై సదరు నటి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, రంగంలోకి దిగిన బెంగళూరు సైబర్ క్రైమ్ పోలీసులు ముగ్గురు వ్యక్తులను ట్రేస్ చేసి అరెస్ట్ చేశారు. వ్యూస్, లైక్స్ కోసం ఈ యువకులు ఏఐ టూల్స్ వాడి మార్ఫింగ్ చేసినట్లు ఒప్పుకున్నారు. వరుసగా సినీ తారలు ఇలా డీప్‌ఫేక్ వీడియోల బారిన పడుతుండటం సినీ ఇండస్ట్రీలో కలకలం రేపుతోంది. దీనిపై కఠిన చట్టాలు తీసుకురావాలని నెటిజన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.

