బ్రిటన్ రాజధాని లండన్ సమీపంలో ఘోర రైలు ప్రమాదం చోటుచేసుకుంది. లండన్‌కు ఉత్తరంగా ఉన్న బెడ్ఫోర్డ్ (Bedford) ప్రాంతంలో ఈస్ట్ మిడ్లాండ్స్ రైల్వేకు చెందిన రెండు ప్యాసింజర్ రైళ్లు ఒకదానికొకటి అత్యంత బలంగా ఢీకొట్టాయి. శుక్రవారం సాయంత్రం జరిగిన ఈ భీకర ప్రమాదంలో ఒక రైలు డ్రైవర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, ఏకంగా 89 మంది ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో 11 మంది పరిస్థితి విషమంగా ఉన్నట్లు మెడికల్ అధికారులు వెల్లడించారు. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక, అంబులెన్స్ సిబ్బందితో పాటు ఏకంగా ఆరు ఎయిర్ అంబులెన్స్‌లు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలించాయి.
నాటింగ్‌హామ్ నుండి లండన్ సెయింట్ పాన్‌క్రాస్ వైపు వెళుతున్న ఒక రైలు సాంకేతిక లోపంతో పట్టాలపై ఆగిపోగా, అదే ట్రాక్‌పై వేగంగా వచ్చిన మరో రైలు వెనుకనుంచి బలంగా ఢీకొట్టడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక విచారణలో తేలింది. రైళ్లు ఢీకొట్టిన వేగానికి బాంబు పేలినట్లు పెద్ద శబ్దం వచ్చిందని, ప్రయాణికులు సీట్లలోంచి గాల్లోకి ఎగిరిపడ్డారని ప్రత్యక్ష సాక్షులు భయంతో చెప్పారు. ఈ ఘోర ప్రమాదం పట్ల బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ (Keir Starmer) తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఘటన నేపథ్యంలో ఆ మార్గంలో అన్ని రైళ్ల రాకపోకలను అధికారులు పూర్తిగా నిలిపివేశారు.

